: గత పదేళ్లలో ఎన్నడూ లేనంత ఘోరానికి టీసీఎస్, ఇన్ఫోసిస్ లెక్కలు!
భారత ఐటీ రంగం విపరీతమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వేళ, ఈ రంగంలోని దిగ్గజ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్ లు గత పదేళ్లలో ఎన్నడూ లేనంత ఘోరమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయని ఐటీ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఆదాయం, నికర లాభం తదితరాలు గణనీయంగా తగ్గనున్నాయని అంచనా వేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న నిర్ణయం, సంప్రదాయ ఐటీ వ్యాపారం ఆటోమేషన్ దిశగా సాగుతుండటం, కొత్త క్లయింట్ల చేరిక ఆశాజనకంగా లేకపోవడం ఇందుకు కారణాలని వెల్లడించారు. దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్, మిడ్ సైజ్ సంస్థ మైండ్ ట్రీ తదితరాలు ఇప్పటికే తమ ఆదాయంపై అతిగా ఆశలు పెట్టుకోవద్దన్న సంకేతాలు వెలువరించాయి. సాధారణంగా ఐటీ కంపెనీలకు క్యూ-2 సీజన్ బలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధం. మరోవైపు ఇన్ఫోసిస్ సైతం ఈ ఏటి ఆదాయ వృద్ధిని తగ్గించింది. ఈ సంవత్సరం 10 నుంచి 11.5 శాతం మధ్య వృద్ధి ఉంటుందని ఇన్ఫీ ప్రకటించగా, అది 9 శాతాన్ని మించకపోవచ్చని ఐటీ రంగ విశ్లేషకులు భావిస్తున్నారు. "టాప్-5 ఐటీ కంపెనీల ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే, 1.5 శాతం వరకూ మాత్రమే పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన పదేళ్లలో ఇదే అతి స్వల్పం. హెచ్సీఎల్ టెక్ మెరుగైన ప్రదర్శన కనబరిచే అవకాశాలున్నాయి. విప్రో కూడా నష్టపోయే అవకాశాలే అధికం" అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అనలిస్ట్ కులదీప్ కౌల్ వ్యాఖ్యానించారు. ఐటీ సేవలకు డిమాండ్ సైతం తగ్గుతోందని అంబిట్ కాపిటల్ అనలిస్ట్ సాగర్ రస్తోగి వెల్లడించారు. పలు ప్రాజెక్టులు రద్దు లేదా వాయిదా పడ్డాయని, త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా ఐటీ కంపెనీల యాజమాన్యాలు చెప్పే భవిష్యత్ ఆదాయ అంచనాలు ఆసక్తికరమని ఆయన తెలిపారు. కాగా, గత సంవత్సరం 12.3 శాతం అభివృద్ధితో 108 బిలియన్ డాలర్లను అధిగమించిన భారత ఐటీ పరిశ్రమ, ప్రస్తుతం 37 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తోంది. అయితే, ఈ సంవత్సరం అనుకున్నంతగా కొత్త ఉద్యోగులను పరిశ్రమ నియమించుకోలేదు. పెరిగిన యాంత్రీకరణతో కొత్త ఉద్యోగుల అవసరాన్ని తగ్గిస్తోందన్నది నిపుణుల అభిప్రాయం.