: 30 ఏళ్లు నిండిన ప్రతి మహిళా ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందే: ప్రభుత్వం
30 ఏళ్లు నిండిన ప్రతి మహిళా ఇకపై నోటి, గర్భాశయ ముఖద్వార, రొమ్ము కేన్సర్ పరీక్షలను కచ్చితంగా చేయించుకోవాలి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. 'స్క్రీనింగ్ అండ్ మేనేజ్ మెంట్ ఆఫ్ కేన్సర్' కింద కొన్ని సూచనలు కూడా చేసింది. తొలుత దేశంలో ఎంపిక చేసిన 100 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ కేన్సర్ నివారణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ఈ ఏడాది నవంబర్ (వచ్చే నెల) నుంచి అగర్తలా నుంచి ఈ ప్రోగ్రాం మొదలవుతుంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ, కేన్సర్ ను ముందుగానే పసిగడితే ప్రాణాలు కాపాడుకునేందుకు వీలవుతుందని చెప్పారు. స్క్రీనింగ్ టెస్టుల వల్ల మహిళల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరుగుతుందని తెలిపారు. కేన్సర్ నివారణకు నిర్దిష్టమైన ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించడంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నడ్డా వెల్లడించారు. సబ్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి నుంచి ఈ మూడు రకాల కేన్సర్ లకు స్క్రీనింగ్ టెస్టులను నిర్వహిస్తామని తెలిపారు.