: వన్డే మ్యాచ్ లో ఇంగ్లండ్ కు షాకిచ్చిన బంగ్లాదేశ్
బంగ్లాదేశ్ లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ కు షాక్ తగిలింది. మిర్పూర్ లో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ జయకేతనం ఎగురవేసింది. నిన్న జరిగిన డేనైట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో మొహ్మదుల్లా 75, మోర్తజా 44లు రాణించారు. అనంతరం, 239 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్... బంగ్లా పేస్ అటాకింగ్ కు విలవిల్లాడింది. 44.4 ఓవర్లకే చాప చుట్టేసిన ఇంగ్లండ్ 204 పరుగులు మాత్రమే చేసింది. దీంతో, 34 పరుగులతో ఇంగ్లండ్ ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 26 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను బెయిర్ స్టో 35, బట్లర్ 57లు మధ్యలో కాసేపు ఆదుకున్నారు. మోర్తజా నాలుగు వికెట్లు, తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మోర్తజా ఎంపికయ్యాడు. ఈ విజయంతో సిరీస్ ను 1-1తో బంగ్లాదేశ్ సమం చేసింది. చివరి వన్డే బుధవారం జరగనుంది.