: చంద్రబాబు నోటి నుంచి బయటకొచ్చిన నల్లధనం 'రహస్యం'!
దేశంలో నల్లధనం దాచుకున్న వారు చట్టం నుంచి బయటపడేందుకు తుది అవకాశంగా స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని కేంద్రం ప్రకటించిన వేళ, దేశవ్యాప్తంగా రూ. 65 వేల కోట్లకు పైగా బ్లాక్ మనీని ప్రజలు 'వైట్'గా చేసేసుకున్నారు. ఇకపై వీరెవ్వరిపైనా విచారణ ఉండబోదని, వీరిని ప్రశ్నించబోమని కేంద్రం స్పష్టం చేసింది. అందరి పేర్లూ రహస్యంగా ఉంటాయని ప్రకటించింది. ఈ విషయంలో ఓ రహస్యాన్ని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దేశంలో రూ. 65 వేల కోట్లు వెలుగులోకి వస్తే, హైదరాబాద్ లోనే రూ. 13 వేల కోట్ల నల్లధనం బయటపడిందని గుర్తు చేసిన ఆయన, ఓ హైదరాబాదీ రూ. 10 వేల కోట్ల నల్లధనాన్ని చూపించాడని చెప్పారు. ఆ వ్యక్తి వ్యాపారా? లేక రాజకీయ నాయకుడా? అన్నది తేలాల్సి వుందని చెప్పారు. అత్యంత రహస్యంగా ఉండాల్సిన వివరాలు చంద్రబాబుకు తెలియడం, ఆయన దాన్ని తన నోటి వెంట చెప్పడం విశేషమే.