: 'హాయ్' అంటూ అందమైన వాయిస్... నమ్మితే నట్టేట మునగడం ఖాయం!
తెలుగు రాష్ట్రాల్లో గతంలో లేని సైబర్ నేరాలు పోలీసుల దృష్టికి వస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీ నేరాలను సైతం క్లిష్టతరం చేస్తున్న వేళ, సైబర్ నేరగాళ్లు సైతం అప్ డేట్ అవుతూ, సరికొత్త ప్లాన్లు వేస్తూ, అమాయక ప్రజలను దోచుకుంటున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన వీరి కొత్త ప్లాన్, దాని అమలుతీరు పోలీసులను సైతం విస్తుపోయేలా చేస్తోంది. ఇక వీరి బారినుంచి తమను తాము కాపాడుకోవాలంటే, స్వీయ జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఆ మోసం చేసే మార్గం ఏంటంటే... "హాయ్... నా పేరు నీలిమ. నేను ఫలానా బ్యాంకులో కస్టమర్ సర్వీసెస్ అధికారిణిని. మీ పేరు సుబ్బారావే కదా?" అని వినిపిస్తుంది. అప్పటికే ముఠా తాము మోసం చేయాలనుకున్న వారి పేరు తెలుసుకుని ఉంటారు. దీనికి స్పందించి "అవును" అని చెబితే, అక్కడి నుంచి కథ మొదలవుతుంది. "మీ బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన కనీస మొత్తం లేదు. వెంటనే మీరు రూ. 1000 డిపాజిట్ చేయాలి. లేకుంటే ఈసారి డిపాజిట్ చేస్తే మరింత కట్ అవుతుంది" అని వినిపిస్తుంది. అదేంటి నా ఖాతాలో 40 వేల రూపాయలు ఉన్నాయే... అనుకుంటూ, "నా ఖాతాలో డబ్బుందిగా?" అని ప్రశ్నిస్తే, "అవునా? ఏదో తప్పు వచ్చినట్టుంది. ఒక్కసారి మీ కార్డు నంబర్ చెబుతారా?" అని మొదటి సారి, ఆపై "వెనకాలున్న మూడంకెల సంఖ్య చెప్పండి. సరిచూస్తాను. కేవైసీ నిబంధనల కింద ఆధార్ సంఖ్య చెప్పండి. కస్టమర్ ఐడీ చెప్పండి. చిరునామా చెప్పండి" అంటూ మాయమాటలతో అన్ని వివరాలూ తీసేసుకుంటారు. "మీరు ఏ వివరాలు అయినా చెప్పొచ్చు గానీ, బ్యాంకు నుంచి వచ్చే వన్ టైమ్ పాస్ వర్డ్ (ఓటీపీ)ని మాత్రం ఎవరికీ చెప్పకండి" అని కూడా సలహా ఇస్తారు. ఆపై "అవునండీ మీ ఖాతాలో డబ్బుంది. ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి" అంటూ కాల్ ముగుస్తుంది. అప్పటికి మోసంలో ఒక తంతు పూర్తయినట్టు. ఇక రెండో దశకు తెరతీసే సైబర్ నేరగాళ్లు, ఏదో ఒక టెలికం ఆపరేటర్ ను ఆశ్రయించి, ఆధార్ నంబరు, అడ్రస్ చెప్పి, సిమ్ పోయిందని వెల్లడించి, కొత్త సిమ్ తీసుకుంటారు. సరిగ్గా అది యాక్టివేషన్ అయ్యే సమయానికి సుబ్బారావుకు మరో కాల్ వస్తుంది. "సార్ నేను బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాను. మీ సెల్ ఫోన్ కు మెసేజ్ లు సరిగ్గా వెళ్లడం లేదు. ఓ పావుగంట సేపు స్విచ్ ఆఫ్ చేసి ఉంచి, ఆపై ఆన్ చేస్తారా?" అంటూ అదే హస్కీ వాయిస్ వినిపిస్తుంది. దాన్ని నమ్మిన సుబ్బారావు సెల్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఆ వెంటనే ఆన్ లైన్లో ట్రాన్సాక్షన్ జరిపే నేరగాళ్లు, ఖాతాలోని మొత్తాన్నీ జుర్రేస్తారు. లావాదేవీ పూర్తికావడానికి అవసరమయ్యే ఓటీపీ వారు యాక్టివేషన్ చేయించుకున్న సిమ్ కు వెళుతుంది. ఇంకే ముంది, సుబ్బారావు ఖాతాలోని డబ్బంతా మటాష్. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాల బారిన పడ్డ వారి సంఖ్య ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉంది. వీటిపై ఫిర్యాదులు చేసినా, వారిని పట్టుకోవడం క్లిష్టతరం అవుతోందని, ప్రజలే జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకు ఉద్యోగులు ఏ విధమైన కార్డు నంబర్లను అడిగినా అది మోసం చేస్తున్నట్టు గుర్తించాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు.