: కళాఖండాన్ని అడ్డం పెట్టుకుని పాక్ కొత్త కుట్రలు.. ‘డ్యాన్సింగ్ గాళ్’ కోసం డిమాండ్!
భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ఉక్కిరి బిక్కిరి అవుతున్న పాకిస్థాన్ ఇప్పుడు ఓ కళాఖండాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలకు సిద్ధమవుతోంది. సింధు లోయలో బయటపడిన మొహంజదారో కాలంనాటి కాంస్య విగ్రహాన్ని భారత్ తమకు అప్పగించాలని పాక్ త్వరలో డిమాండ్ చేయనున్నట్టు పాక్ పత్రికలు కథనాలు ప్రచురించాయి. 1926లో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఎర్నెస్ట్ మాకే సింధు లోయ ప్రాంతంలో 4500 ఏళ్లనాటి ‘డ్యాన్సింగ్ గాళ్’ విగ్రహాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఇది న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భద్రంగా ఉంది. అయితే విగ్రహం లభించిన ప్రాంతం ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉండడంతో యునెస్కో మార్గదర్శకాల ప్రకారం ఆ కళాఖండం తమకే దక్కాలన్నది పాక్ వాదన. ఈ మేరకు పాకిస్థాన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ జనరల్ సయీద్ జమాల్ షా పేర్కొన్నట్టు ఆ దేశ పత్రికలు కథనాలు ప్రచురించాయి. ఈ డాన్యింగ్ గాళ్ విగ్రహాన్ని త్వరలోనే తమకు అప్పగించాలని పాక్ త్వరలోనే భారత్‌ను డిమాండ్ చేయనున్నట్టు అందులో పేర్కొన్నాయి.