: సర్జికల్ దాడుల్లో ఉగ్రవాదులను వెంటాడి హతమార్చింది నిజమే.. పాక్ సైన్యం రేడియో సంభాషణల్లో బట్టబయలు


భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులపై ఇప్పటి వరకు వస్తున్న విమర్శలను పటాపంచలు చేసే బలమైన ఆధారం ఒకటి బయటపడింది. మెరుపు దాడులు అసలు జరగనేలేదని, అదంతా భారత్ ఆడుతున్న బూటకమని బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్‌కు దిమ్మదిరిగే సాక్ష్యాలు భారత్ వద్ద ఉన్నాయి. గత నెల 28 అర్ధరాత్రి జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత పాకిస్థాన్ సైన్యం రేడియో సంభాషణలపై నిఘా పెట్టిన భారత ఆర్మీ వాటిని రికార్డు చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పించింది. పాక్ ఆర్మీ రేడియో సంభాషణల్లో ఏముందంటే.. ‘‘సరిహద్దు ఆవల ఉన్న ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడిచేసింది. ఓ చోట పదిమంది, మరో చోట 9 మంది ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు’’ అని సైనికులు తమ ఉన్నతాధికారులకు వివరించారు. వీరికి శిక్షణ ఇచ్చిన పాక్ ఆర్మీ సరిహద్దుల్లోకి తీసుకొచ్చి చొరబాట్లకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే పాక్ సైన్యం రేడియో సంభాషణలు 28వ తేదీ ఉదయం నుంచి పూర్తిగా ఆగిపోయాయి. దీంతో చొరబాట్లను ముందే ఊహించిన భారత ఆర్మీ వారు చొరబడ్డాక ఎదుర్కోవడం కాకుండా వారికే ఎదురెళ్లి మట్టుబెట్టాలని నిర్ణయించుకుని దాడులకు పూనుకుంది. భారత సైనికులు ఒక చోటుకు చేరుకున్నాక ఐదు బృందాలుగా విడిపోయి దాడులు నిర్వహించారు. వారి శిబిరాల్లోనే వారిని మట్టుబెట్టింది. మృతి చెందిన ఉగ్రవాదులందూ లష్కరే తాయిబాకు చెందినవారు కావడంతో ఆ సంస్థకు భారీ నష్టం జరిగింది. భారత సైన్యం దాడుల నుంచి ఉగ్రవాదులు తేరుకునేలోపే భారీ నష్టం జరగడంతో మిగతా ఉగ్రవాదులు పాక్ సైన్యం కాపలా ఉండే సరిహద్దు పోస్టు వద్దకు పరుగులు తీశారు. వారిని వెంటాడి మరీ మన సైన్యం మట్టుబెట్టింది. దాడి అనంతరం పాక్ సైనిక వాహనాల్లోనే ఉగ్రవాదుల మృతదేహాలను తరలించారు. నీలం నదీ లోయలో ఒకే చోట వారిని పూడ్చి పెట్టారు. ఈ మొత్తం వివరాలను పాక్ సైనికులు తమ ఉన్నతాధికారులకు రేడియో సంభాషణల్లో వివరించారు. వీటిని రికార్డు చేసిన భారత సైన్యం కేంద్రానికి సమర్పించింది.

  • Loading...

More Telugu News