: కోహ్లీ డబుల్ సెంచరీ, 150 దాటిన రహానే

100 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన స్థితిలో విరాట్ కోహ్లీకి జతగా అజింక్య రహానే వచ్చిన తరువాత మూడో టెస్టు రెండో రోజు ఆటే మారిపోయింది. విరాట్ కోహ్లీ, రహానేలు 150 పరుగుల మైలురాయిని దాటేసి జట్టు స్కోరును ముందుకు సాగించారు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీని దాటేశాడు. మొత్తం 347 బంతులాడిన కోహ్లీ 18 ఫోర్ల సాయంతో 200 పరుగులకు చేరాడు. మరో ఎండ్ లో ఉన్న రహానే 328 బంతుల్లో 159 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత స్కోరు 142 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 446 పరుగులు. భారత జట్టులో మూడు, నాలుగో స్థానంలో దిగిన ఆటగాళ్లు ఇద్దరూ 150 పరుగులు దాటడం చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. 2003-04 సీజనులో టెండూల్కర్, 241, లక్ష్మన్ 178 పరుగులు చేసి ఈ రికార్డును స్థాపించగా, దాన్ని కోహ్లీ, రహానేలు సమం చేశారు. ఇక న్యూజిలాండ్ పై పోటీ పడ్డ జట్లలో కెప్టెన్ గా అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ పేరిటే ఉంది. 1999లో అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ గా ఉన్న సచిన్ 217 పరుగులు చేశాడు. మరో 17 పరుగులు చేస్తే, ఆ రికార్డు కోహ్లీ పరమవుతుంది. కెప్టెన్ గా బరిలోకి దిగి, రెండు సార్లు 150 పరుగులు సాధించిన విజయ్ హజారే, గవాస్కర్, అజారుద్దీన్ ల సరసన కూడా కోహ్లీ చేరిపోయాడు.

More Telugu News