: జూనియర్ ఎన్టీఆర్ ను వాడుకొని వదిలేయలేదా?: అంబటి నిప్పులు
అవసరం ఉన్న సమయంలో వాడుకోవడం, ఆపై వదిలేసి అవమానాల పాలు చేయడం చంద్రబాబుకు అలవాటేనని, అదే అలవాటు లోకేష్ కూ వచ్చిందని వైకాపా నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, గతంలో ఎన్నికల వేళ, జూనియర్ ఎన్టీఆర్ ను అలాగే వాడుకుని వదిలేశారని ఆరోపించారు. వైకాపా అధినేత జగన్ కు లోకేష్ బహిరంగ లేఖ రాయడాన్ని ప్రస్తావించిన ఆయన, మంత్రులతో ఎలాంటి సంబంధముందని లోకేష్ శిక్షణా తరగతులకు వచ్చి వారిని కించపరిచారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. లోకేష్, చినరాజప్పల వీడియోను ఎడిట్ చేసి విడుదల చేశారని, ఎడిట్ చేయని కాపీ బయటకు ఇస్తే, అసలు విషయం బయటపడి పరువు పోతుందని చంద్రబాబుకు తెలుసునని అన్నారు. తెలుగుదేశం పార్టీ తన అధికార సామాజిక మాధ్యమ ఖాతాల్లో పెట్టిన పోస్టును తిరిగి ఎందుకు తొలగించారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్ కుల రాజకీయాలు చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.