: ఇండియాలోనే యుద్ధ విమానాల తయారీ: ప్రపంచ బిడ్ లకు ఐఏఎఫ్ ఆహ్వానం


ఇండియాకు వచ్చి సింగిల్ ఇంజన్ యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థలను ఆహ్వానిస్తూ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అంతర్జాతీయ ఫైటర్ జెట్ తయారీ సంస్థలకు లేఖలు రాసింది. ఈ మేరకు వాషింగ్టన్, మాస్కో, స్టాక్ హోమ్ తదితర దేశాల్లోని ఎంబసీల నుంచి ఆయా దేశాల్లోని యుద్ధ విమాన తయారీ సంస్థలకు సమాచారం అందింది. ఇండియాలో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను పెట్టాలన్నది ఈ కంపెనీలకు విధించిన నిబంధన. ఆసక్తి వున్న కంపెనీలు ప్రాథమిక టెండర్లను దాఖలు చేయాలని కోరుతూ ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్)లను పంపినట్టు తెలుస్తోంది. కాగా, సింగిల్ ఇంజన్ విమానాల కోసం 2007 లోనే ఎంఎంఆర్సీఏ (మల్టీ రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్) టెండర్ ప్రక్రియ మొదలైనప్పటికీ, వివిధ కారణాలతో దాదాపు తొమ్మిదేళ్ల పాటు వాయిదాలు పడుతూ వచ్చింది. దస్సాల్ట్ ఏవియేషన్, యూరో ఫైటర్, సూపర్ హార్నెట్, లక్ హీడ్ మార్టిన్, సూపర్ వైపర్, గ్రిఫిన్ వంటి కంపెనీలు అప్పట్లో ఆసక్తి చూపాయి. ఆపై రఫాలే డీల్ కుదిరిన తరువాత ఎంఎంఆర్సీఏను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రఫాలేలతో పాటే మరిన్ని విమానాలు సమకూర్చుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు సింగిల్ ఇంజన్ ఫైటర్ జెట్ ల కోసం టెండర్లు పిలవాలని ఐఏఎఫ్ నిర్ణయించింది.

  • Loading...

More Telugu News