: గర్ల్ ఫ్రెండ్ కోసం 'దొంగ చావు' ప్లాన్ చేసిన యువకుడు... చిన్న తప్పుతో అడ్డంగా బుక్కయ్యాడు!
అప్పటికే పెళ్లయిన ఓ యువకుడు, మరో అమ్మాయిని ప్రేమించి, ఆమెను వదల్లేక కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న ఉద్దేశంతో సొంత చావును ప్లాన్ చేసుకుని, చిన్న తప్పుతో అడ్డంగా బుక్కైపోయాడు. హరిద్వార్ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే, మొహమ్మద్ ముకర్రమ్ అనే వ్యక్తికి వివాహమైంది. మరో మతానికి చెందిన 22 సంవత్సరాల యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా, ఆమెను వదిలి ఉండలేక పోయాడు. తన భార్యకు దూరమై, కొత్త పేరుతో మరో ప్రాంతంలో ఆమెతో కలసి వుండాలని ప్లాన్ చేశాడు. తాను చనిపోయినట్టు సృష్టించాలని భావించాడు. అందుకు పెద్ద ప్లానే వేశాడు. తనంత ఒడ్డూ పొడవూ ఉన్న ఓ యాచకుడిని ఎంచుకుని, అతన్ని దారుణంగా హత్య చేశాడు. గుర్తు పట్టని విధంగా ముఖాన్ని చెక్కేసి, అతని జేబులో తన ఓటర్ ఐడీ కార్డును పెట్టి వెళ్లిపోయాడు. సెప్టెంబర్ 19న పోలీసులకు వచ్చిన ఫిర్యాదులో భాగంగా రూర్కే ప్రాంతంలోని పిరాన్ కలియార్ సమీపంలో ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. జేబులోని ఓటర్ కార్డు మినహా మృతుడి గురించి మరేమీ వివరాలు దొరకలేదు. ఓటర్ కార్డు ఆధారంగా, మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. దర్యాఫ్తులో భాగంగా, ఆ యువకుడు, అమ్మాయి కలసి తిరుగుతూ ఉండేవారని కనిపెట్టారు. ఇదే విచారణలో కీలకమైంది. తన మరణాన్నైతే నమ్మించాడు కానీ, ముకర్రమ్ తనకు తెలీకుండానే తప్పు చేశాడు. అతని సెల్ ఫోన్ నుంచి ఆ అమ్మాయికి ఫోన్స్ చేశాడు. ఇదే పోలీసుల్లో అనుమానాన్ని పెంచింది. తాను మరణించానని నమ్మించిన వ్యక్తి కొత్త ప్రదేశంలో సులువుగా తిరగవచ్చుగానీ, సొంత ఫోన్ వాడలేడుగా?... దీనిపై కన్నేసిన పోలీసులు, ఆ నంబర్ ను ట్రాక్ చేస్తూ, అమ్మాయి ఫోన్, ముకర్రమ్ ఫోన్ ఒకే ప్రాంతానికి వచ్చే వరకూ వేచి చూసి, అతన్ని అరెస్ట్ చేశారు.