: 'బాల తపస్వి' అంటూ కొనియాడుతూ, సెల్ఫీలు తీసుకున్నప్పుడు తెలీదా?: మరణించిన జైన బాలిక తల్లిదండ్రులు


68 రోజుల పాటు 'చౌమాసా' (జైన సంప్రదాయంలో ఉపవాస దీక్ష) చేసిన 13 ఏళ్ల బాలిక ఆరాధన మరణించిన తరువాత తమపై వస్తున్న విమర్శలపై బాలిక తల్లిదండ్రులు స్పందించారు. బాలికను అన్ని రోజుల ఉపవాస దీక్షకు అనుమతించడంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, "మేమేమీ దాచలేదు. ఆరాధన ఉపవాస దీక్ష చేస్తోందని అందరికీ తెలుసు. ఆమెను బాల తపస్విగా అభివర్ణిస్తూ, సెల్ఫీలు తీసుకునేందుకు ఎంతో మంది వచ్చారు. వారిలో కొందరు ఇప్పుడు మమ్మల్ని నిందిస్తున్నారు" అంటూ ఆమె తాతయ్య మనేక్ చంద్ సంధారియా వ్యాఖ్యానించారు. కాగా, బాలిక 10 వారాల పాటు ఉపవాస దీక్ష చేసి, అనంతరం విరమిస్తుందని చెబుతూ 'పారణ' (ఉపవాస దీక్ష విరమణ) పోస్టర్లు సికింద్రాబాద్ లోని గోడలపై గత వారంలో కనిపించాయి. తెలంగాణ మంత్రి పద్మారావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వస్తారని, బీబీ పాటిల్ పాల్గొంటారని చెబుతూ, ఓ రథంపై పెళ్లి కూతురి అలంకరణలో ముస్తాబై, బలహీనంగా కనిపిస్తున్న ఆరాధన చిత్రం చూపుతూ పత్రికల్లో ప్రకటనలు సైతం వచ్చాయి. ఇక బాలల హక్కుల సంఘం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని, ఆరాధన తల్లిదండ్రులను చట్టం ముందు నిలపాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టనున్నట్టు నార్త్ జోన్ డిప్యూటీ కమిషనర్ బి.సుమతి వెల్లడించారు.

  • Loading...

More Telugu News