: 'యూరీ' దాడులను ఖండించిన పాకిస్థాన్ నటులు!


ఎట్టకేలకు పాకిస్థాన్ కు చెందిన బాలీవుడ్ నటులు నెమ్మదిగా దిగివస్తున్నారు. అయితే యూరీ సెక్టార్ పై జరిగిన ఉగ్రవాద దాడిని నేరుగా ప్రస్తావించకుండా (అంటే ఉగ్రవాదులు, పాకిస్థానీలకు కోపం రాకుండా) చాలా జాగ్రత్తగా ప్రకటనలు జారీ చేశారు. మహీరా ఖాన్ ప్రకటనలో, ఓ పాకిస్థానీగా, ప్రపంచ పౌరురాలిగా ఉగ్రచర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. రక్తపాతం ఏ గడ్డమీద జరిగినా అది సంతోషించే విషయం కాదు అని పేర్కొంది. అంతకంటే ముందు ఫవాద్ ఖాన్ స్పందిస్తూ, 'నాకు కుమార్తె పుట్టింది. దీంతో బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా పోయాయి. భవిష్యత్ తరాలు ప్రశాంతంగా జీవించేందుకు మరింత శాంతియుతమైన ప్రపంచాన్ని నిర్మించి అందులో ప్రశాంతంగా బతకాలి' అంటూ ఫేస్‌ బుక్‌ లో పోస్టు చేశాడు. దీంతో బాలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుకుంటున్న వీరిద్దరూ నేరుగా యూరీ పేరు కానీ, పాక్ పేరు కానీ పేర్కొనకుండా జాగ్రత్త పడ్డారు. వీరికంటే సింగర్ షఫ్కత్ అలీ ఖాన్ స్పందిస్తూ, 'నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతంలో దాడి జరిగినా దానిని పాక్ నటులు ఖండించారు. మీ పౌరులు, మీ సైనికులు చనిపోతే మీరెంత బాధపడతారన్న విషయం మాకు తెలుసు. కాబట్టి ఉరీ ఘటనను నేను ఖండిస్తున్నా' అంటూ నేరుగా పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News