: ఆర్మీ లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రదాడుల్లో పాక్ ప్రమేయంపై సాక్ష్యాలివిగో!


జమ్మూకశ్మీర్‌ లో సైనికులే లక్ష్యంగా జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో పాకిస్థాన్‌ ప్రమేయాన్ని చాటుతూ ఆర్మీ తిరుగులేని సాక్ష్యాలు వెల్లడించింది. నౌగామ్‌ లో జరిగిన ఎన్‌ కౌంటర్‌ లో ఆర్మీ చేతిలో హతమైన ఉగ్రవాదుల వద్ద దొరికిన గ్రనేడ్లు, ఔషధాలు, తినుబండారాలు పాకిస్థాన్ వేననే సాక్ష్యాలను మీడియాకు ఆర్మీ ప్రదర్శించింది. ఉగ్రవాదుల వద్ద దొరికిన హ్యాండ్‌ గ్రనేడ్లు (ఏఆర్‌జీఈఎస్‌ 84), యూబీజీఎల్‌ గ్రనేడ్లపై పాక్‌ అధికారిక ఆయుధ ఫ్యాక్టరీ మార్కింగ్స్ ఉండగా, వారు వెంట తెచ్చుకున్న ఔషధాలు, తినుబండారాలపై కూడా పాకిస్థాన్ మార్కింగ్ ఉండడం విశేషం. దీంతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాక్ పాత్రను ఇవి రుజువు చేస్తున్నాయని ఇండియన్ ఆర్మీ అధికార ప్రతినిధి తెలిపారు. వారి వద్ద ఆరు ప్లాస్టిక్‌ పేలుడు స్లాబ్స్‌, ఆరు బాటిళ్ల పెట్రోలియం జెల్లీ వంటి తీవ్రస్థాయి పేలుడు పదార్థాలు దొరికాయని ఆయన చెప్పారు. గత సెప్టెంబర్‌ 11న పూంచ్‌ సెక్టార్ లో, సెప్టెంబర్‌ 18న యూరీ సెక్టార్ పై చోటుచేసుకున్న ఉగ్రవాద దాడుల తరహాలోనే తీవ్రస్థాయిలో మండే పేలుడు పదార్థాలతో దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించారని ఆయన చెప్పారు. ఈ ఉగ్రవాదులను పాకిస్థాన్‌ నేరుగా ప్రోత్సహించి, పంపిందన్న విషయాన్ని ఈ ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News