: పంజాబ్ లో ఆసక్తికర రాజకీయాలు... బీజేపీకి రాజీనామా చేసిన సిద్ధూ భార్య
పంజాబ్ లో రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. వెటరన్ క్రికెటర్, వ్యాఖ్యాత, మాజీ ఎంపీ నవజోత్ సింగ్ సిద్ధు మరోసారి పంజాబ్ లో రాజకీయ కేంద్రంగా మారుతున్నారు. ఆయన 'ఆప్'లో చేరవచ్చంటూ ఊహాగానాలు రేగుతున్న ప్రస్తుత దశలో, తాజాగా ఆయన భార్య నవజోత్ కౌర్ సిద్ధు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బీజేపీ ఆమోదించింది. రెండు నెలల క్రితం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సిద్ధూ బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆయన ఆప్ లో చేరుతారంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఆప్ లో 'కుటుంబంలోని ఒక వ్యక్తికే పదవి' అనే నిబంధన అడ్డురావడంతో సుదీర్ఘాలోచన చేసిన ఆయన, తనకు భజన చేసే వారినే కేజ్రీవాల్ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఆరోపిస్తూ, దానికి దూరమయ్యారు. తరువాత మరికొందరు మాజీ క్రీడాకారులతో కలిసి సొంత కుంపటి పెట్టుకున్నారు. 'ఆవాజ్ ఏ పంజాబ్' పేరిట ఓ వేదికను ఏర్పాటు చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ వచ్చిన ఆఫర్ ను కూడా తిరస్కరించారు. దీంతో తమ వేదిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాదని, పంజాబ్ కు సేవచేసేందుకని స్పష్టం చేశారు. అయితే ఏమైందో ఏమో కానీ, ఆయన దానిని కూడా వీడారు. ఈ నేపథ్యంలో ఆయన ఆప్ లో చేరనున్నారంటూ మరోసారి ఊహాగానాలు రేగుతున్న దశలో ఆయన భార్య కూడా బీజేపీకి రాజీనామా చేయడం విశేషం.