: నీళ్లు తాగితే మంచిదంటూ అధికంగా తాగేస్తున్నారా?.. అయితే ప్రమాదమే అంటున్న పరిశోధకులు!


మంచినీరు అధికంగా తీసుకోమని డాక్ట‌ర్లు సూచిస్తుండ‌డం మ‌న‌కు తెలుసు. ప్ర‌తిరోజు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాల‌ని సూచిస్తారు. అయితే, మ‌నిషికి నీరు ఎంత అవ‌స‌ర‌మ‌వుతుందో అంతే తాగ‌డం మంచిద‌ని మోతాదుకి మించి తీసుకోకూడ‌ద‌ని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అసోసియేట్ ప్రొఫెసర్ మైఖేల్‌ ఫారెల్ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌రిశోధ‌న జ‌రిగింది. ఈ అంశంపై ప‌లు ర‌కాల ప‌రిశోధ‌న‌లు చేసిన అనంత‌రం నిజానిజాల‌ను తేల్చి ఎంత నీరు కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ మనిషి శరీరంలో ఉంటుందని చెప్పారు. ఆ వ్య‌వ‌స్థ మ‌నిషిని ఎక్కువ నీళ్లు తాగకుండా ఆపుతుందని పేర్కొన్నారు. మోతాదుకి మంచి నీళ్లు తాగితే 'హైపోనెట్రేమియా' అనే సమస్య వస్తుందని హెచ్చ‌రిస్తున్నారు. ఈ స‌మ‌స్య ఏర్ప‌డితే రక్తంలోని సోడియం ప‌రిమాణం త‌గ్గిపోతుంద‌ని దానివల్ల అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని చెబుతున్నారు. మొద‌టి ద‌శ‌లో వాంతులు, వికారం ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ని పేర్కొన్నారు. ఒక్కోసారి మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం సైతం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అందుకే మ‌నిషి దాహం వేసినప్పుడే నీరు తాగాలని వారు చెబుతున్నారు. అవ‌స‌రం లేనప్పుడు నీళ్లు అధికంగా తాగకూడదని ప‌రిశోధ‌న‌లు తెలిపారు. త‌మ ప‌రిశోధ‌న కోసం కొంత‌మందిని తీసుకున్నామ‌ని, అందులో సగం మందికి దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగాల‌ని సూచించామ‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. మిగ‌తా సగం మందిని అధికంగా నీళ్లు తాగమని చెప్పిన‌ట్లు పేర్కొన్నారు. అనంత‌రం వారి అంద‌రికీ ఎంఆర్ఐ తీసి చూసిన‌ట్లు చెప్పారు. అందులో నీళ్లు అధికంగా తాగిన వ్య‌క్తుల‌ మెదడులోని ప్రీ ఫ్రంటల్ ప్రాంతాలు ఎంతో చురుగ్గా ఉన్న‌ట్లు గ‌మ‌నించారు. అటువంటి వారు ఏదైనా తినాలంటే నమలడానికి చాలా కష్టపడాల్సి వచ్చింద‌ని క‌నుగొన్నారు.

  • Loading...

More Telugu News