: దేశ రాజధానిలోకి ఉగ్రవాదులు చొరబడ్డారు... ఆత్మాహుతి దాడి చేసే అవకాశం!: ఇంటెలిజెన్స్ హెచ్చరిక
దేశ రాజధాని ఢిల్లీలోకి ఇద్దరు ఉగ్రవాదులు చొరబడ్డారని... ఆత్మాహుతి దాడి చేసేందుకు కూడా వారు సిద్ధంగానే ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని హోల్ సేల్ మార్కెట్ కి యాపిల్ పళ్లు తరలిస్తున్న కమర్షియల్ వాహనం ద్వారా వీరిద్దరూ నగరంలోకి ప్రవేశించారని వెల్లడించాయి. వీరిద్దరూ జైషే మహమ్మద్ సంస్థకు చెందిన వారని తెలిపాయి. దీంతో, ఢిల్లీలో హైలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో సంచరించే వారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. రైళ్లు, బస్సుల్లో వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలోని టోల్ ప్లాజాల వద్ద తనిఖీలను ముమ్మరం చేశారు. ఛాందీ చౌక్, పహార్ గంజ్ లాంటి రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు, కొన్ని రోజుల పాటు ఢిల్లీలోకి ప్రవేశించే వాహనాలపై నిషేధం విధిస్తున్నట్టు తెలిపారు. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో నిఘా పెంచారు.