: నేటి నుంచి న్యూజిలాండ్‌తో చివరి టెస్ట్.. క్లీన్ స్వీప్‌పై భారత్ గురి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తొలి రెండింటిని అలవోకగా దక్కించుకున్న టీమిండియా క్లీన్ స్వీప్‌పై దృష్టి సారించింది. నేటి నుంచి మొదలయ్యే చివరిదైన మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. 2012-13లో 4-0తో ఆస్ట్రేలియాను, ఆ తర్వాత వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన భారత్ ఇప్పుడు కివీస్‌పైనా ఇదే రకమైన విజయాన్ని సొంతం చేసుకోవాలన్న కసితో ఉంది. సంప్రదాయ క్రికెట్‌లో సొంతగడ్డపై ఎదురులేని భారత్ మరోమారు తన సత్తా చాటాలని నిర్ణయించింది. మరోవైపు ఇప్పటికే తొలి రెండు టెస్టులు కోల్పోయిన న్యూజిలాండ్ ఈ మ్యాచ్ నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది. తొలి రెండు మ్యాచుల్లో ఆతిథ్య టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. దీంతో నేటి నుంచి ఇండోర్‌లో ప్రారంభమయ్యే టెస్ట్‌లో సమష్టిగా రాణించి విజయం సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. తొలిసారి టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఇండోర్ స్టేడియం పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌లకు అనుకూలిస్తుంది. అయితే వర్షం ముప్పు మాత్రం పొంచి ఉంది. వర్షం కారణంగా చివరి రెండు రోజుల ఆటకు అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.