: తమిళనాడు సీఎంగా అజిత్?.. తెరపైకి అకస్మాత్తుగా హీరో పేరు!
17 రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంకా కోలుకోకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తర్జనభర్జనలు మొదలయ్యాయి. ఉప ముఖ్యమంత్రి ఎంపిక దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం పేర్లు తెరపైకి వచ్చాయి. గవర్నర్‌తో ఇరువురు మంత్రులు, సీఎస్ భేటీ అయ్యారు. దీంతో ఉప ముఖ్యమంత్రి ఎంపికకు దాదాపు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. జయలలిత ఇప్పట్లో పరిపాలనలో పాలు పంచుకోవడం కష్టమని వైద్యులు చెప్పడంతో ‘డిప్యూటీ’ ఎంపికకు కసరత్తు ప్రారంభమైనట్టు సమాచారం. కాగా మరోవైపు అనూహ్యంగా ప్రముఖ నటుడు అజిత్ పేరు తెరపైకి వచ్చింది. ఆయన పేరు ఇప్పుడు తమిళనాడులో హల్‌చల్ చేస్తోంది. అన్నాడీఎంకేలోనూ ఈ పేరు తీవ్ర చర్చనీయాంశమైంది. ‘‘ప్రస్తుత నటుల్లో నా చరిష్మా, నా మనస్తత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తి అజిత్ మాత్రమే. నా వారసుడి లక్షణాలు ఆయనలో పుష్కలంగా ఉన్నాయి’’ అని జయ తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్టు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతోంది. గతంలో అజిత్ రెండుమూడుసార్లు జయలలితను కలిశారు కూడా. సీఎం తన మనసులో మాట బయపెట్టడంతో కాబోయే సీఎం అజిత్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో అటు అజిత్ నుంచి కానీ, ఇటు పార్టీ వర్గాల నుంచి ఎటువంటి సమాచారం లేదు.