: తిరిగి ప్రశ్నించినందుకు దళితుడిపై కత్తితో దాడి... తల తెగ్గోసిన వైనం!
ఉత్తరాఖండ్ లో సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... కదారియా అనే గ్రామంలో కుందన్ కుమార్ సింగ్ కు చెందిన పిండిమిల్లు వద్దకు గోధుమ పిండి పట్టించుకునేందుకు సోహన్ రామ్ అనే దళిత వ్యక్తి వెళ్లాడు. ఇదే సమయంలో ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసే లలిత్ కర్నాటక్ అనే వ్యక్తి కూడా అక్కడికి చేరుకున్నాడు. దళితుడైన సోహన్ పిండి ఆడించుకునేందుకు అక్కడికి రావడంవల్ల ఆ ప్రదేశం మొత్తం అపవిత్రం అయిందని, కులం తక్కువవాడిని ఎందుకు రానిస్తారంటూ పరుష వ్యాఖ్యలు చేశాడు. దీంతో, అవమానానికి గురైన సోహన్ 'ఎందుకలా నోరు పారేసుకుంటారు?' అని ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన లలిత్...'నన్నే ప్రశ్నిస్తావా?' అంటూ అక్కడే ఉన్న పెద్ద కొడవలితో అతని మెడపై ఒక్క వేటు వేశాడు. అంతటితో ఆగని లలిత్...అదే ఆవేశంతో...సోహన్ తలను మొండెం నుంచి వేరు చేశాడు. దీంతో ఆ గ్రామంలో దళితులు ఆందోళన చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.