: కొత్త జిల్లా కోసం వ్యక్తి ఆత్మహత్యాయత్నం
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పలువురికి తీవ్ర నిరాశను కూడా మిగుల్చుతోంది. తమ ప్రాంతాన్ని జిల్లాగా చేయాలంటూ పలు ప్రాంతాల నుంచి అనేక డిమాండ్లు ప్రభుత్వానికి అందాయి. ఇదే క్రమంలో, వరంగల్ జిల్లాలోని ములుగు కేంద్రంగా కూడా జిల్లాను ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అఖిలపక్షాల ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ములుగులో నిరసనలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు మంజల భిక్షపతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది.