: తాత్కాలిక సీఎం అవసరం లేదంటున్న అన్నాడీఎంకే అధికారప్రతినిధి
తమిళనాడుకు తాత్కాలిక సీఎంను నియమించాల్సిన అవసరం లేదని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి అవది కుమార్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జయలలిత స్పృహలోనే ఉన్నారని, త్వరలోనే ఆమె కోలుకుంటారని అన్నారు. గతంలో న్యాయపరమైన చిక్కులు తలెత్తినప్పుడు మాత్రమే ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం సీఎంగా బాధ్యతలు చేపట్టారని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి ఏమీ లేదని అన్నారు. కాగా, అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ అనారోగ్యంతో 1984లో అమెరికాలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఇక్కడి వ్యవహారాలను ఆయనే చక్కబెట్టారని, ఆ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన, అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని అవది కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.