: ఈ జైలులో కుటుంబ సభ్యులతో కలసి హాయిగా ఉండొచ్చు!
జైలు శిక్ష అంటేనే నరకం. తెలిసిన వారెవరూ ఉండరు...జీవితంలో ఏదో ఒక పొరపాటు చేసి దుర్భర జీవితాన్ని ఏళ్ల తరబడి అనుభవించడాన్ని మించిన నరకం ఏముంటుంది? అదలా ఉంచితే, శిక్ష ముగిసిన తరువాత ఇంకోరమైన శిక్ష ఎదురు చూస్తుంటుంది. ఏళ్ల తరబడి కుటుంబానికి దూరంగా ఉండడంతో కుటుంబ సభ్యులతో బంధాలకు బీటలు వారతాయి. ఇలాంటి నేపథ్యంలో జైలులో కుటుంబంతో కలిసి ఉండే అవకాశం ఉంటే...అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది? మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ జిల్లాలోని ఓ జైలులో ఖైదీలకు కుటుంబంతో కలిసి ఉండే అవకాశాన్ని అక్కడి అధికారులు కల్పించారు. అయితే ఇది కేవలం త్వరలో శిక్షా కాలం ముగియనున్న ఖైదీలకు మాత్రమే వర్తిస్తుంది. శిక్ష ముగిసిన అనంతరం కుటుంబంతో కలవడానికి ఖైదీలు పడుతున్న ఇబ్బందులను చూసిన అధికారులు ఈ తరహా అవకాశం కల్పిస్తున్నారు. త్వరలో శిక్ష ముగియనున్న ఖైదీలు చివరి రోజుల్లో భార్యా, పిల్లలతో కలిసి ఉండడమే కాకుండా, వారు బయటికి వెళ్లి పనిచేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని ప్రస్తుతం శంకర్, ముఖేశ్, మంగీలాల్, ధర్మేంద్ర, జితేంద్ర అనే ఖైదీలు వినియోగించుకుంటున్నారు. ఈ ఐదుగురు ఖైదీలు ఉదయాన్నే పని నిమిత్తం బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి జైలుకు రాగానే కుటుంబంతో కలిసి టీవీ చూస్తూ హాయిగా భోజనం చేసి పడుకుంటారు. ఇది సత్ఫలితం ఇవ్వడంతో త్వరలో గ్వాలియర్, జబల్‌పూర్, ఉజ్జయిని జిల్లాల్లోని జైళ్లలో కూడా ఈ తరహా సౌకర్యాన్ని కల్పించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.