: తమిళనాడులో జయలలిత స్థానంలో ముఖ్యమంత్రిగా తమిళ హీరో?... తమిళనాట పుకార్లు!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గత కొన్ని రోజులుగా ఆసుపత్రికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఆమె కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని అపోలో వైద్యులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని కూడా జయలలితను చూసేందుకు అనుమతించలేదు. మరోవైపు సుబ్రహ్మణ్యస్వామి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాయడం కూడా మొదలు పెట్టారు. రేపటి నుంచి ట్వీట్ల యుద్ధం ప్రారంభించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో జయలలిత వారసుడి గురించి తమిళనాట విపరీతమైన చర్చ నడుస్తోంది. ఆమె వారసుడిగా, ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని అన్నాడీఎంకే నేతలు ఇప్పటికే రజనీకాంత్ తో చర్చలు జరిపారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సూపర్ స్టార్ ససేమీరా అన్నారని తెలుస్తోంది. దీంతో, తమిళనాట రజినీకాంత్ తరువాత అంతటి స్థాయిలో క్రేజ్ ఉన్న అజిత్ తో చర్చలు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె వీలునామా రాశారని, డాంబికాలకు దూరంగా ఉంటూ సామాన్యుడిలా ఉండే అజిత్ పట్ల జయలలిత అభిమానం చూపించేవారని, ఆమె వారసుడిగా ముఖ్యమంత్రి బాధ్యతలు అజిత్ స్వీకరించనున్నాడంటూ తమిళనాడు, సోషల్ మీడియా వేదికల్లో మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. అజిత్ ను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా పార్టీ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని, యువత మొత్తం అన్నాడీఎంకే వెన్నంటి ఉంటారని పార్టీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.