: రూ. 11,300 కోట్లు కట్టండి: టాటాను అమెరికా కోర్టుకు లాగిన డొకొమొ
జపాన్ కు చెందిన టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకొమొ టాటా సన్స్ సంస్థపై అమెరికా కోర్టులో దావా వేసింది. మొత్తం 1.17 బిలియన్ డాలర్లను (సుమారు రూ. 11,300 కోట్లు) ఆ సంస్థ తమకు నష్టపరిహారంగా చెల్లించాల్సి వుందని, ఈ మేరకు లండన్ మధ్యవర్తిత్వ న్యాయస్థానంలో విజయం సాధించినా, డబ్బు కట్టడం లేదని ఆరోపిస్తూ, న్యూయార్క్ కోర్టులో పిటిషన్ వేసింది. తమకు ఇవ్వాల్సిన డబ్బుకు వివిధ దేశాల్లోని టాటా సంస్థల ఆస్తులను అటాచ్ చేసే దిశగానే అమెరికాలో కేసు వేసినట్టుగా తెలుస్తోంది. కాగా, 2009లో టాటా టెలీ సర్వీసెస్ లో ఎన్టీటీ పెట్టుబడులు పెట్టిన తరువాత, టాటా డొకొమొ పేరిట మొబైల్ సేవలను సంస్థ అందించిన సంగతి తెలిసిందే. ఆపై ఇరు కంపెనీలూ విడిపోయాయి. అప్పటి నుంచి డొకొమొకు ఇవ్వాల్సిన ఎగ్జిట్ ఎమౌంట్ ను టాటాలు చెల్లించలేదు. ఈ మొత్తాన్ని ఇవ్వడానికి తాము సిద్ధమేనని, అయితే, భారత ప్రభుత్వం ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఔట్ ఫ్లోకు అనుమతి ఇవ్వాల్సి ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం. టాటా ఆస్తులను అటాచ్ చేసే హక్కు డొకొమొకు లేదని సంస్థ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ కోర్టుల్లో ఉన్న వివాదాలను ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు.