: అశ్లీల మెసేజ్ లతో బాస్ లైంగిక వేధింపులు... తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య!
విధులు నిర్వహిస్తున్న చోట మహిళలు అనుభవిస్తున్న శారీరక, మానసిక క్షోభకు ఇది మరో నిదర్శనం. తన పైఉద్యోగి కామ వాంఛలకు, అశ్లీల ప్రవర్తనకు తట్టుకోలేని ఓ వివాహిత చివరకు సూసైడ్ చేసుకుని తనువు చాలించింది. ఈ దారుణ ఘటన పూణెలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, 32 ఏళ్ల ఓ మహిళ సేనాపతి రోడ్ లోని డీహెచ్ఎఫ్ఎల్ బ్రాంచ్ లో క్రెడిట్ మేనేజర్ గా పనిచేస్తోంది. సూరజ్ బుండేలే అనే ఓ కామాంధుడు ఆమెకు పైస్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు. సదరు మహిళపై సూరజ్ కన్ను పడింది. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. తన మాటలతో ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. అంతేకాదు, ఆమె మొబైల్ ఫోన్ కు అశ్లీల మెసేజ్ లు పెడుతుండేవాడు. ఈ నేపథ్యంలో, ఎంతో మనో వేదనకు గురైన ఆమె... ఆఫీస్ లో టార్చర్ ఎక్కువగా ఉందని, ఉద్యోగం మానేస్తానని భర్తకు కూడా చెప్పింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. గత నెల 8న యథాప్రకారం ఉదయం 9.30కి అతను ఆఫీసుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత సాయంత్రం 8.30కి ఇంటికి వచ్చాడు. తలుపు తట్టాడు, కాలింగ్ బెల్ కూడా అనేక సార్లు కొట్టాడు. అయినా, లోపల నుంచి సమాధానం లేదు. దీంతో, పొరుగువారి సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాడు. బెడ్ రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ తన భార్య కనపడగానే అతను షాక్ కు గురయ్యాడు. ఈ ఆత్మహత్యకు సంబంధించి వార్జే మాల్వాడీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఆమె భర్త చెప్పిన వివరాలను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లిన తర్వాత తన భార్య ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిందని... ఆ సమయంలో కూడా ఆమె మొబైల్ కు బుండేలే పలు మార్లు ఫోన్ చేశాడని... చివరకు తాను ఫోన్ లిఫ్ట్ చేసి, జరిగిన ఘటనను అతనికి వివరించానని ఆమె భర్త తెలిపాడు. ఆ తర్వాత మొబైల్ ఫోన్ ను తాను పూర్తిగా చెక్ చేశానని... బుండేలే నుంచి తన భార్యకు అనేక అశ్లీల మెసేజ్ లు వచ్చాయని చెప్పాడు. ఆమె వేరే ఫోన్ కు కూడా ఇదే తరహా మెసేజ్ లు వచ్చాయని తెలిపాడు. మీ ఇంటి పార్కింగ్ లోనే ఉన్నానంటూ బుండేలే పంపిన మెసేజ్ కూడా ఉందని చెప్పాడు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత మరణానికి కారకుడైన బుండేలే ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.