: నవాజ్ షరీఫ్ ప్రభుత్వం విఫలమైంది...హఫీజ్ సయీద్ ను కట్టడి చేయాలి!: పాకిస్థాన్ ఎంపీ డిమాండ్
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేయాలని భారత్ ప్రయత్నాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. పాక్ ఉగ్రవాదంపై భారత్‌తో పాటు పలు దేశాలు కూడా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాయి. అయితే, పాకిస్థాన్ ప్రస్తుతం తమ సొంత దేశ నేతల నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. తమ రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి మరీ పాక్‌ను ఆ దేశ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ ఎంపీ రానా మహ్మద్ అఫ్జల్ ఇదే అంశంపై నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అఫ్జల్ అన్నారు. హఫీజ్ పాక్‌లో ఏమైనా గుడ్లు పెడుతున్నాడా? అని ఆయన ప్రశ్నించారు. భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడుల వెనుక హఫీజ్ ఉన్నాడంటూ ఆరోపణలు వస్తోన్నా ఆ ఉగ్రవాదిపై చర్యలు తీసుకోవడంలో తమ దేశ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. విదేశీ వ్యవహారాల్లో తమ దేశం పాటిస్తోన్న తీరును కూడా ఆయన ప్రశ్నించారు. హఫీజ్ ఉగ్రవాది అని భారత్ అంతర్జాతీయంగా వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. హఫీజ్ విషయంలో పాక్ ఎంతో కఠిన వైఖరి అవలంబించాలని అన్నారు. ప్రభుత్వం ఉగ్రవాదులపై చర్యలు చేపట్టి పాక్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలనుకుంటున్న ప్రపంచదేశాల ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.