: పాక్ సరిహద్దుల పూర్తి మూసివేత యోచన!


భారత్, పాకిస్థాన్ ల మధ్య నాలుగు రాష్ట్రాల్లో విస్తరించివున్న సరిహద్దు ప్రాంతాన్నంతా మూసివేసే ఆలోచన జరుగుతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రెండు రోజుల జైసల్మేర్ పర్యటనలో భాగంగా బీఎస్ఎఫ్ (ఉత్తర) కార్యాలయంలో జరిగే కీలక సమీక్షా సమావేశంలో దీనిపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, జమ్మూ కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్ బీర్ సింగ్ బాదల్ లు కూడా ఈ సమావేశానికి హాజరై, పాక్ తో అన్ని రకాల బంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకునే విషయమై చర్చించనున్నారు. వీరితో పాటు బీఎస్ఎఫ్ అధికారులు, పాక్ తో సరిహద్దులను పంచుకుంటున్న రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మొత్తం 2,289.66 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా, అందులో 2,034.96 కిలోమీటర్ల మేరకు ఫెన్సింగ్ ఉంది. మిగిలిన 254.80 కిలోమీటర్ల ప్రాంతంలోనూ సరిహద్దును మూసివేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇక్కడ చర్చించనున్నారని అధికారులు తెలిపారు. మొత్తం బార్డర్ లో సీసీ కెమెరాలు, మనుషుల కదలికలను పసిగట్టే సెన్సార్లు, రాడార్లు, లేజర్లు తదితరాల అమరికపైనా ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సరిహద్దుల్లో పర్యటించే రాజ్ నాథ్ సింగ్, రేపు ఉదయం బీఎస్ఎఫ్ అధికారులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్నారు.

  • Loading...

More Telugu News