: ఎయిర్ లైన్స్ ఫేర్ వార్ లో ఇండిగో... రూ. 888కే టికెట్
ఈ పండగ సీజన్ లో కొనసాగుతున్న ఎయిర్ లైన్స్ ధరల యుద్ధంలో తక్కువ ధరలకు విమానయాన సౌకర్యాన్ని అందిస్తున్న వాటిలోకి ఇండిగో కూడా వచ్చి చేరింది. నేడు, రేపు బుక్ చేసుకుని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 13 వరకూ అమలులో ఉండేలా దేశవాళీ ప్రయాణానికి రూ. 888 ప్రారంభ ధరతో టికెట్లను విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ ఆఫర్ లో కొన్న టికెట్లకు రిఫండ్ ఉండదని తెలిపింది. ఎన్ని సీట్లను ఈ ధరకు ఆఫర్ చేస్తున్నదీ ప్రకటించనప్పటకీ, సంస్థ అధికారిక వెబ్ సైట్లో చెక్ చేస్తే, ఢిల్లీ - జైపూర్ రూట్ లో జనవరిలో ప్రయాణానికి రూ. 888పై టికెట్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే అత్యంత బిజీగా ఉండే ఢిల్లీ నుంచి ముంబై రూట్ లో రూ. 2,152కు టికెట్లు కనిపిస్తున్నాయి. కాగా, ఇప్పటికే విస్తారా, స్పైస్ జెట్, ఎయిర్ ఆసియా, జెట్ ఎయిర్ వేస్ లు ప్రమోషనల్ ఆఫర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.