: మన్ హటన్ బ్రిడ్జ్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ జెయింట్ పోస్టర్
అమెరికా ప్రధాన నగరాల్లో ఒకటైన న్యూయార్క్ లోని ప్రఖ్యాత మన్ హటన్ వారధిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారీ పోస్టర్ వెలిసింది. 30 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉన్న ఈ జెయింట్ పోస్టర్ ను బ్రిడ్జ్ కి వేలాడదీసి ఉద్రిక్తతలు పెంచాలని చూసిన వారిని గుర్తించేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు. రష్యన్ జెండా బ్యాక్ గ్రౌండ్ లో పుతిన్ ఉన్న చిత్రం, దానిపై 'పీస్ మేకర్' అన్న అక్షరాలు కనిపిస్తున్నాయి. ఈ బ్యానర్ గురించి గురువారం మధ్యాహ్నం 2:45 గంటల సమయంలో తమకు ఫోన్ వచ్చిందని, ఆపై అరగంట తరువాత దీన్ని తొలగించామని పోలీసు వర్గాలు తెలిపాయి. దీన్ని ఎవరు పెట్టారన్న విషయం తెలియరాలేదని వివరించాయి.