: ములుగు జిల్లా కోసం కేసీఆర్‌తో ఫైట్‌కు సిద్ధమైన మంత్రి చందూలాల్.. తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయం


ప్రత్యేక జిల్లా కోసం కావాల్సిన అన్ని లక్షణాలు ములుగు (వరంగల్ జిల్లా)కు ఉన్నప్పటికీ దానిని పరిగణనలోకి తీసుకోకపోవడంపై తెలంగాణ గిరిజన సంక్షేమశాఖా మంత్రి అజ్మీరా చందూలాల్ గుర్రుగా ఉన్నారు. ములుగు జిల్లా కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తుతున్నా, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా సీఎం పట్టించుకోకపోవడంపై ఒకింత నిరాశగా ఉన్న చందూలాల్ ఈ విషయాన్ని ఆయన వద్దే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో కొన్ని నెలలుగా మసకబారుతున్న ప్రతిష్ఠను జిల్లా పేరుతో పెంచుకోవాలని మంత్రి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్టు సమాచారం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయమై సీఎం కేసీఆర్‌తో జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి చందూలాల్ ములుగును జిల్లాగా ప్రకటించాలని కోరారు. అయితే ఆ విషయాన్ని మర్చిపోవాలని కేసీఆర్ నేరుగా చెప్పడంతో మంత్రి ఇరకాటంలో పడ్డారు. ప్రతిపాదనలో లేని నాలుగు జిల్లాలు తెరపైకి రావడం, వాటిలో ములుగు పేరు లేకపోవడంతో తన నియోజకవర్గం ప్రజల నుంచి ఒత్తిడి రావడం మొదలైంది. దీంతో ఈ విషయంలో ముఖ్యమంత్రిని కలిసి మరోమారు విజ్ఞప్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. మరోవైపు గద్వాల జిల్లా కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ రాజీనామాకు సిద్ధపడడం, నారాయణపేట జిల్లా కోసం అధికారపార్టీ ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తానని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కోసం మంత్రి రాజీనామా చేయాలని అనుచరులు పట్టబడుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎంను కలిసి ములుగు విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని చందూలాల్ నిర్ణయించుకునట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News