: కుదుటపడుతున్న ‘అమ్మ’ ఆరోగ్యం.. మరిన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలంటున్న వైద్యులు
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతున్నట్టు ఆమెకు వైద్యం అందిస్తున్న అపోలో ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని తెలిపాయి. ‘‘ఎయిమ్స్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్యుల బృందం సీఎంకు చికిత్స అందిస్తోంది. వీరి చికిత్సకు జయలలిత బాగానే స్పందిస్తున్నారు. లండన్ నుంచి వచ్చిన క్రిటికల్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ రిచర్డ్ బేల్ గురువారం జయను మరోమారు పరీక్షించారు’’ అని అపోలో వర్గాలు పేర్కొన్నాయి. ముఖ్యమంత్రికి ఉన్న మధుమేహం, వింటర్ బ్రాంకైటిస్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వైద్యుల సూచనల మేరకు మెడికల్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించినట్టు అపోలో సీఈవో సుబ్బయ్య విశ్వనాథన్ తెలిపారు. ఎయిమ్స్ నుంచి వచ్చిన ఊపిరితిత్తుల నిపుణుడు డాక్టర్ జి.ఖిల్నానీ, అనస్తీషియాలజీ, క్రిటికల్ కేర్ వైద్యుడు డాక్టర్ అంజంత్రికా, కార్డియాలజీ నిపుణుడు డాక్టర్ నితిశ్ నాయక్ జయలలితను పరీక్షించారు. మరోవైపు జయలలిత ఆరోగ్య పరిస్థితిని వెల్లడించాలంటూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఆమె ఆరోగ్య స్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ విడుదల చేస్తుండడం వల్ల ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని న్యాయస్థానం సూచించింది.