: పాకిస్థాన్ సోషల్ మీడియాలో ‘హీరో’ అయిపోయిన కేజ్రీవాల్.. అంతా కేజ్రీమయం!


పాక్ ఆక్ర‌మిత కశ్మీర్‌లో భార‌త సైన్యం జ‌రిపిన దాడుల‌పై ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఇటీవ‌లే స్పందిస్తూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి జై కొడుతూనే దాడికి సంబంధించిన ఆధారాలు బ‌య‌ట‌పెట్టాల‌ని ఓ వీడియో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో, ఇప్ప‌టికే పాకిస్థాన్ మీడియా ఆయ‌న‌ను హీరోని చేసేసింది. తాజాగా కేజ్రీవాల్‌ను పాకిస్థాన్‌ సోష‌ల్ మీడియాలోనూ హీరోను చేసేసి, ఆయనపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తోంది. కేజ్రీవాల్ భార‌త్‌లో ఓ హీరోలాగా స్పందించార‌ని సోష‌ల్‌ మీడియాలో పాకిస్థానీయులు పోస్టులు పెడుతున్నారు. కేజ్రీవాల్‌ వాస్త‌వం మాట్లాడార‌ని పేర్కొంటున్నారు. 'పాకిస్థాన్ స్టాండ్స్ విత్ కేజ్రీవాల్' పేరుతో ట్విట్టర్ లో ఓ యాష్ ట్యాగ్‌ను(#pakstandswithkejriwal) ఏర్పాటు చేసి సోష‌ల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేజ్రీవాల్ త‌ప్ప‌ మిగ‌తా వాళ్లంతా భార‌త ప్ర‌ధాని మోదీ, ఆర్మీ చేతిలో ఫూల్స్ అయ్యార‌ని సోష‌ల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఇండియా చేస్తోన్న ప్ర‌చారాన్ని కేజ్రీవాల్ మాత్ర‌మే ధైర్యంగా ప్ర‌శ్నిస్తున్నార‌ని, త‌మ దేశ‌ ప్ర‌భుత్వాన్నే నిల‌దీస్తున్నార‌ని వారు పోస్టులు పెడుతున్నారు. పాక్ చేస్తోన్న ఈ పోస్ట్‌ల‌పై ప‌లువురు ఇండియ‌న్లు స్పందిస్తూ 'అయితే కేజ్రీవాల్ ను పాకిస్థాన్ కే తీసుకెళ్లండి' అని స‌ల‌హా ఇస్తున్నారు. 'ఉగ్ర‌వాది బుర్హాన్ వ‌నీని ఐక్యరాజ్య‌స‌మితిలో హీరోగా అభివ‌ర్ణించిన‌ట్లు కేజ్రీవాల్ ను కూడా ఆ ఐరాస‌లో పొగ‌డండి' అంటూ మరికొందరు కౌంట‌ర్ ఇస్తున్నారు. కేజ్రీవాల్ పాక్ సరిహద్దు వైపు నవాజ్ షరీఫ్ పక్కన నిలబడినట్లు, మోదీ టీమ్ భారత సరిహద్దులో నిలబడినట్లు కార్టూన్లు కూడా పోస్టులు చేస్తున్నారు. పాక్ ఉగ్రవాదులకు కేజ్రీవాల్ నమస్కారం చేస్తున్నట్లు పోటా పోటీగా ఇండియన్లూ పోస్టులు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News