: ఏకంగా అగ్రరాజ్యం అమెరికాకే హెచ్చరికలు జారీచేసిన పాకిస్థాన్!.. అదీ అమెరికాలోనే..!


పాకిస్థాన్ తన స్థాయిని మించి వ్యాఖ్యలు చేస్తోంది. ఇంత‌వ‌ర‌కు భార‌త్‌తో పాటు త‌మ ప్ర‌త్య‌ర్థి దేశాల‌పైనే వ్యాఖ్యలు చేస్తూ బీరాలు ప‌లుకుతున్న పాక్ తాజాగా తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదంటూ అగ్రరాజ్యం అమెరికాపైనే హెచ్చరికలు చేసింది. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్ భారత్‌పై దుష్ప్ర‌చారం చేయాల‌ని చూస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ విష‌యాన్ని అంత‌ర్జాతీయంగా తెల‌పాలంటూ పాక్ రాయ‌బారుల‌కు పురమాయించింది కూడా. ప్రస్తుతం పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ దూత ముషాహిద్‌ హుస్సేన్‌ సయెద్ అమెరికా పర్యటనలో ఉన్నారు. కశ్మీర్‌ విషయమై 90 నిమిషాల పాటు అమెరికా ప్రతినిధులకు సయెద్ వివ‌రించారు. అయితే, కశ్మీర్‌ విషయంలో వారి వాదనను అమెరికా అంగీకరించలేదు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డ్డారు. అమెరికా ప్రధాన మేధోసంస్థ అయిన అట్లాంటిక్‌ కౌన్సిల్‌లో పాల్గొన్నారు. అందులో సంప్రదింపులు ముగిసిన వెంటనే ముషాహిద్‌ హుస్సేన్‌ సయెద్ మాట్లాడుతూ.. అమెరికా ప్రపంచ శక్తి కాదని వ్యాఖ్యానించారు. ఆ దేశ ప్రపంచాధిపత్యం నీరుగారిపోతోందని పేర్కొన్నారు. 'ఆ దేశం గురించి ఇక మరిచిపోదాం' అని వ్యాఖ్యానించారు. భారత్‌, కశ్మీర్‌ విషయాల్లో త‌మ దేశం చేస్తోన్న వాదనను అమెరికా పెడ‌చెవిన పెడితే త‌మ దేశం రష్యా, చైనాలకు దగ్గరవుతుంద‌ని హెచ్చరికలు జారీ చేశారు. ఆయ‌న మాట‌లు అధికారికంగా కెమెరాలో రికార్డు కాలేదు. అయితే, అక్క‌డ‌కు వ‌చ్చిన ప్ర‌తినిధులంద‌రికీ స్పష్టంగా వినిపించాయి.

  • Loading...

More Telugu News