: దేశ రక్షణ విషయంలో కుతంత్రాలు పన్నడానికి సైతం వెనుకాడను!: రక్షణ మంత్రి మనోహర్ పారికర్
దేశ రక్షణ విషయంలో తాను కుతంత్రాలు పన్నడానికి సైతం సిద్ధమేనిని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. నియంత్రణ రేఖను దాటి భారత సైన్యం పీవోకేలోని ఉగ్రవాదులపై చేసిన దాడులపై ఆయన మరోసారి స్పందించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... భారత సైన్యం జరిపిన దాడులు వందశాతం కచ్చితమైనవని పేర్కొన్నారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు కొన్ని అగ్ర దేశాలు కూడా సర్జికల్ దాడులు చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అయితే, భారత సైన్యం జరిపిన దాడుల్లా అవి ఇంతగా విజయవంతం కాలేదని చెప్పారు. ఆధారాలు విడుదల చేయాలంటూ పలువురు నేతలు డిమాండ్ చేసినంత మాత్రాన వాటిని బయటపెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. తనకు ముక్కుసూటి మనిషిగా పేరుందని మనోహర్ చెప్పుకున్నారు. అయితే, ప్రస్తుతం తాను ఉన్న మంత్రి హోదాలో దేశ భద్రత దృష్ట్యా ముక్కు సూటిగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే కేంద్రం సర్జికల్ దాడులను ప్రచారం చేసుకుంటుందంటూ చేస్తోన్న ప్రతిపక్షాల విమర్శలను ఆయన ఖండించారు. భారత్ చేసిన సర్జికల్ దాడులను ఎంతో మంది పొగుడుతున్నారంటే మన జవాన్లను వారు ప్రశంసిస్తున్నారని దాని అర్థమని ఆయన చెప్పారు.