: 'మలాలా విద్యా నిధి' కోసం పాక్ సాకర్ టీమ్ ఛారిటీ మ్యాచ్
బాలికల హక్కులకై పోరాడి తాలిబాన్ల తుపాకి గుండ్లకు గాయపడిన పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్ జాయ్ క్రీడాకారుల్లోనూ స్ఫూర్తి రగిలిస్తోంది. తాలిబాన్ల దాడి నుంచి కోలుకున్న అనంతరం చదువుకునేందుకు డబ్బు లేక ఇబ్బంది పడుతున్న వారికోసం 'బాలికల విద్యా నిధి'ని స్థాపించింది మలాలా. ఈ నిధికి హాలీవుడ్ నటి ఏంజెలినా జోలి, పలువురు తమ విరాళాలను అందించారు. ఈ నేపథ్యంలో తమవంతు సహాయం అందించేందుకు పాకిస్థాన్ ఫుట్ బాల్ జట్టు కూడా ముందుకొచ్చింది.
ఇందుకోసం పాక్, 'యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్'తో ఓ చారిటీ ఫుట్ బాల్ మ్యాచ్ ను ఆడనుంది. ఐరాస ప్రపంచశాంతి దినోత్సవం అయిన సెప్టెంబర్ 21న ఈ మ్యాచ్ జరగనుంది. దీనిద్వారా వచ్చిన డబ్బును మలాలా 'బాలికల విద్యా నిధికి' అందిస్తారు. దీనిపై పాక్ సాకర్ టీమ్ మార్కెటింగ్ కన్సల్టెంట్ సర్ధార్ నవీద్ హైదర్ మాట్లాడుతూ.. 'మలాలా విద్యా నిధి' కోసం ఆడుతున్నందుకు జట్టు సభ్యులు గర్వపడుతున్నారని తెలిపారు.