: చంద్రబాబు పాలనలో అగ్రకులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు: సీపీఐ రామకృష్ణ సెటైర్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దళిత, గిరిజన, బలహీన వర్గాలకు రాష్ట్ర సర్కారు నష్టం కలగజేస్తోందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలనలో రాష్ట్రంలో అగ్రకులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దళితులకు ఇంతగా అన్యాయం జరుగుతోంటే ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, రావెల కిషోర్బాబు వాటిపై ఎందుకు స్పందించడం లేదని ఆయన అడిగారు. ఈ అంశంపై తాము చంద్రబాబుకి లేఖ రాశామని, అయినా తమకు సమాధానం రాలేదని ఆయన అన్నారు. కాగా, అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలని ఆయన అన్నారు.