: ప్రతి ఒక్కరిపై చంద్రబాబుకు రిపోర్టులు వెళుతున్నాయి: నారా లోకేష్
కార్యకర్తలను పట్టించుకోని నేతలను పార్టీ కూడా పట్టించుకోదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. విజయవాడలోని కేఎల్ యూనివర్శిటీలో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో కార్యకర్తల సంక్షేమంపై ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముకలాంటి వారని చెప్పారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు. తనతో సహా ఏ నేతకైనా సరే పనితీరు ఆధారంగానే పదవులు ఉంటాయని చెప్పారు. ప్రతి ఒక్కరి పనితీరుపై పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదికలు వెళుతున్నాయని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలను అదే స్థాయిలో తిప్పికొట్టాలని సూచించారు. ఈ సందర్భంగా 'కార్యకర్తలకు త్రికరణ శుద్ధితో నివాళి' అనే పుస్తకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో మరణించిన కార్యకర్తల వివరాలను, పార్టీ తరపున వారి కుటుంబాన్ని ఆదుకున్న తీరును వివరించారు.