: ఉగ్రభూతాలను తరిమేయండి... పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహ జ్వాలలు!
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవాద తండాలపై అక్కడి ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా వారు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ క్రమంలో, పీవోకేలోని గిల్గిట్, నీలమ్, చినారి, కోట్లి, ముజఫరాబాద్ ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాద శిబిరాల కారణంగా తమ జీవితాలు నరకప్రాయంగా మారాయని... తమపై ఉగ్రవాదులు తీవ్ర ప్రభావం చూపుతున్నారని... వెంటనే వాటిని ఏరిపారేయాలంటూ పీవోకేలోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యం వెంటనే రంగంలోకి దిగి... ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించాలని నిరసనకారులు కోరుతున్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం మంచిది కాదని పీవోకేలోని నేతలు తెలిపారు. అంతేకాదు, ఉగ్రవాదులపై చర్యలు తీసుకోకపోతే... తమ ప్రాంతంలోని పరిస్థితులను తమ చేతుల్లోకే తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పీవోకేలోని ఉగ్ర తండాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించిన తర్వాత... అక్కడ ప్రజల్లో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగిపోయింది. భారత దాడులతో పాక్ ఉక్కిరిబిక్కిరి కావడంతో... పీవోకే ప్రజలు తమ గళాన్ని మరింత పెంచారు. పాక్ సైన్యం, ఐఎస్ఐ దురాగతాలు, తమ ప్రాంతంలో కొనసాగుతున్న మానవహక్కుల ఉల్లంఘనలపై తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేశారు.