: పాక్‌లో అలాంటి కార్య‌క్ర‌మం చేప‌డితే దానికి పతంజలి సంస్థ నాయకత్వం వహిస్తుంది: సర్జికల్ స్ట్రయిక్స్ పై రాందేవ్ బాబా


ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హిస్తోన్న‌ పాకిస్థాన్‌తో చర్చించడం అంటే పంది ఎదుట ముత్యాలు చల్లడమ‌ేనని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. పాకిస్థాన్ ఉగ్ర‌వాదుల ఆగ‌డాల‌కు ప్ర‌తిస్పంద‌న‌గా నియంత్రణ రేఖ‌ను దాటి భారత సైన్యం చేసిన స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్‌పై ఆయ‌న‌ స్పందించారు. ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మారుస్తూ సైనికులు చేసిన దాడులు అద్భుతమని అన్నారు. భార‌త సైన్యం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, ఉగ్రవాది హఫీజ్ సయీద్‌లు టార్గెట్‌గా త‌దుప‌రి దాడులు జ‌ర‌పాల‌ని ఆయ‌న సూచించారు. పాక్‌కు తొలిసారిగా చెప్పుదెబ్బ‌లాంటి సమాధానం చెప్పామని రాందేవ్ బాబా అన్నారు. పాక్ ఎప్పుడూ అబద్ధాలు చెబుతూనే ఉంటుంద‌ని, పీవోకేలో భార‌త సైన్యం దాడులే జరప‌లేదంటూ ఉగ్రవాదుల మృతదేహాలను అక్కడినుంచి తరలించింద‌ని ఆయ‌న అన్నారు. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఆ దాడికి సంబంధించిన‌ ఆధారాలు, వీడియో ఫుటేజి స‌ర్కారు వ‌ద్ద‌ ఉన్నాయని ఆయ‌న చెప్పారు. ఆ ఆధారాల‌ను బయట పెడితే భార‌త సైన్య వ్యూహాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి కాబట్టి, ఆ అంశంపై ప్రభుత్వమే ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. అంతేకానీ, ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ డిమాండ్ల‌పై స్పందిస్తూ ఆ వీడియోలు బ‌య‌ట‌పెట్ట‌డం స‌రికాద‌ని అన్నారు. భార‌త సైన్యం స‌ర్జిక‌ల్ స్ట్రయిక్స్ చేయ‌క‌పోతే తాము దీటుగా స్పందిస్తామని ఇమ్రాన్ ఖాన్ లాంటి వారు ఎందుకు అంటార‌ని ఆయ‌న అడిగారు. పాకిస్థాన్‌లోని యువతరం చ‌దువుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని రాందేవ్ బాబా అన్నారు. అందుకోసం భారతీయులంతా కొద్దికొద్దిగా విరాళాలు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అక్షరాస్యత సాధిస్తేనైనా ఉగ్రవాద ఆలోచ‌న‌లు వారి మెద‌ళ్ల నుంచి వదులుతాయని అన్నారు. పాక్‌లో అలాంటి కార్య‌క్ర‌మం చేప‌డితే దానికి త‌మ‌ పతంజలి సంస్థ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. అలాగే, చైనా అంశంపై స్పందించిన రాందేవ్ ఆ దేశం నుంచి భార‌త్‌కు వెన్నుపోటు తప్ప ఏమీ రాలేదని వ్యాఖ్యానించారు. చైనా ఉత్పత్తులను భార‌త్ బహిష్కరించాలని ఆయ‌న డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News