: శాంసంగ్ ఫోన్లో మంటలు.. విమానాన్ని ఖాళీ చేయించిన అధికారులు
సెల్‌ఫోన్ నుంచి పొగవచ్చి, స్వల్పంగా మంటలు వ్యాపించిన ఘటన ఈరోజు అమెరికాలోని కెంటకీ నుంచి బాల్టిమోర్ వెళ్లాల్సిన విమానంలో చోటుచేసుకుంది. సదరు సెల్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మోడల్‌గా తెలుస్తోంది. ఫోనుకు మంటలు అంటుకోవడంతో విమానంలో ఉన్న ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. ఈ ఘటనపై విమానాశ్రయ అధికారులు స్పందిస్తూ... ప్రయాణికుడి వద్ద ఉన్న శాంసంగ్ ఫోనులోంచి పొగలు వచ్చినట్లు తమకు ఒక కస్టమర్ సమాచారం అందించాడని చెప్పారు. సదరు సెల్‌ఫోన్ బ్రియాన్ గ్రీన్ అనే వ్యక్తికి చెందిందిగా గుర్తించారు. కాగా, ఈ ఘటనపై స్పందించిన శాంసంగ్ కంపెనీ బ్రియాన్ వద్ద ఉన్న ఫోను తమ కంపెనీకి చెందిందేనని ఇంకా స్పష్టం కాలేదని పేర్కొంది. పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ అధికారులను తమ కంపెనీ అధికారులు సంప్రదిస్తున్నారని, ధ్వంసం అయిన ఫోన్‌ను పరిశీలించి అందుకు కారణాలేంటో వెల్లడిస్తామని చెప్పింది. ఇటీవలే సింగపూర్ నుంచి వచ్చిన విమానం చెన్నైలోని ఓ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక ప్రయాణికుడి వద్ద ఉన్ శాంసంగ్ నోట్ 2 ఫోన్ పేలిన సంగతి తెలిసిందే. ఇటువంటి ఘటనలు అధికమవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం అమెరికాలో శాంసంగ్ గెలాక్సీ నోట్-7 పేలింది. దానిపై ఓ వ్యక్తి కేసు కూడా పెట్టాడు. అయితే, తాము ఇప్పటికి 25 లక్షల స్మార్ట్ ఫోన్లను రీప్లేస్ చేశామని శాంసంగ్ చెప్పింది. బ్యాటరీలో లోపం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే, బ్రియాన్ గ్రీన్ తన ఫోన్‌ను ఇప్పటికే రీప్లేస్ చేసుకున్నానని చెప్పాడు. అయినప్పటికీ మంటలు వచ్చాయని అన్నాడు. ఇప్పటికే పలు విమానాయాన సంస్థలు శాంసంగ్ ఫోన్లను విమానాల్లోకి అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశాయి.