: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు శుభవార్త... కోరినన్ని లడ్డూలు లభ్యం!
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు టీటీడీ ఈవో సాంబశివరావు శుభవార్తను వినిపించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తులందరికీ అవసరమైనన్ని లడ్డూలు తయారు చేస్తున్నామని చెబుతూ, ఎవరికెన్ని కావాలంటే అన్ని ఇవ్వాలని టీటీడీ ఈవో సిబ్బందిని ఆయన ఆదేశించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు రోజు రోజుకీ భక్తుల రద్దీ పెరుగుతోందని అన్నారు. వారికి అవసరమైన లడ్డూ కౌంటర్లు 24గంటల పాటు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ నాలుగు మాడవీధుల్లో వివిధ గ్యాలరీలకు ఏర్పాటు చేసిన తాళాలను ఎప్పటికప్పుడు సరిచూసు కోవాలని ఆయన హెచ్చరించారు. గ్యాలరీలలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు, అందుకు సంబంధించిన గ్రిల్స్ పటిష్టంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులు స్వామివారిని చూసేందుకు చూపే ఉత్సాహంలో భాగంగా విద్యుద్దీపాలకంరణతో ఏర్పాటు చేసిన కటౌట్లపైకి ఎక్కుతున్నారని, దీంతో ప్రమాదాలు సంభవించే అవకాశం వుందని అన్నారు. దీంతో అక్కడ అదనపు సిబ్బందిని నియమించి, అవాంఛనీయ చర్యలు నిరోధించాలని సిబ్బందికి సూచించారు. అవసరమైన మేరకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు, స్వామి వారి సేవలకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిమీదా ఉందని ఆయన అన్నారు.