: ‘ఇలా చేస్తే బాగుంటుంది’... భారత్-పాక్ పై మోదీకి సుబ్రహ్మణ్యస్వామి లేఖ
ప్రత్యర్థులపై తనదైన శైలిలో స్పందించే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి పాకిస్థాన్‌తో భారత్‌కు ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఆ దేశం నుంచి భారత్‌కు సిమెంట్ దిగుమతిని ఆపేయాలని సూచించారు. దేశీయ పరిశ్రమలకు లాభం చేకూర్చేలా, జాతీయ భద్రతను కాపాడేలా ఈ అంశాన్ని పరిశీలించాల్సిందేనని ఆయన కోరారు. పాక్ నుంచి సిమెంట్ దిగుమతులు చేసుకోవడమంటే నిషేధిత వస్తువులు, హానికరమైన ఆయుధాలు అక్రమ రవాణాను ప్రోత్సహించినట్లేనని ఆయన పేర్కొన్నారు. పాక్‌తో పాటు చైనా, బంగ్లాదేశ్ నుంచి సిమెంట్ దిగుమతి ఎక్కువగా అవుతోందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. వాటిని దిగుమతి చేసుకునే ఒక డంపింగ్ గ్రౌండ్ గా భారత్ మారిందని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ నుంచి సిమెంటు దిగుమతి చేసుకుంటే దేశీయ సిమెంట్ పరిశ్రలకు నష్టమేనని ఆయన అన్నారు. భారత్ వాటిపై విధించే పన్నుల అంశాన్ని ఆలోచించాలని, సిమెంట్ పై కాకుండా దాని తయారీకి అవసరమైన పదార్థాలపై పన్నులు విధించాలని ఆయన కోరారు. అలా చేస్తే దిగుమతి సుంకాన్ని ఆకర్షించవచ్చని చెప్పారు. మేకిన్ ఇండియా కాన్సెప్ట్ కు కూడా సిమెంట్ దిగుమతి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు.