: తరువాత ట్రంప్ వస్తే కష్టమే... ఒబామా దిగిపోయే ముందే 'ప్రిడేటర్' డీల్ కోసం భారత్ తీవ్రయత్నాలు!
అత్యాధునిక మానవ రహిత విమానాలుగా పేరు తెచ్చుకున్న ప్రిడేటర్ డ్రోన్ డీల్ ను సాధ్యమైనంత త్వరగా అమెరికాతో కుదుర్చుకోవాలని భారత్ తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అధ్యక్షుడిగా ఒబామా పదవీకాలం పూర్తయ్యేలోగానే ఈ డీల్ పై సంతకాలు జరిగితే మేలని ఇండియా భావిస్తోంది. మొత్తం 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్ల కొనుగోలు చర్చలు గత జూన్ లోనే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశలో ఉన్నాయి. మరో ఒకటి రెండు నెలల్లో డీల్ ఖరారవుతుందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని అధికారి ఒకరు తెలిపారు. నవంబర్ లో అమెరికాకు కొత్త అధ్యక్షుడు ఎన్నిక కానుండటంతో, ఒకవేళ రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విజయం సాధిస్తే, ప్రిడేటర్ డ్రోన్ల డీల్ ఆలస్యం కావచ్చన్న అనుమానాలు సైతం ఉన్నాయని ఆయన తెలిపారు. సరిహద్దు భద్రత సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఈ డ్రోన్లను వినియోగించి కాపలా కాస్తే సత్ఫలితాలు వస్తాయని భారత్ నమ్ముతున్న సంగతి తెలిసిందే. అయితే, ఆయుధ రహిత ప్రిడేటర్లను విక్రయిస్తామని అమెరికా చెబుతుంటే, అవసరమైతే ఆయుధాలను వినియోగించుకునేందుకూ వాడుకుంటామని భారత్ చెబుతోంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరకనే డీల్ ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది.