: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థుల వాడీవేడీ చర్చ... తిట్లు..పొగడ్తలు!
అమెరికా అధ్యక్ష అభ్యర్థులిద్దరూ వారి డిప్యూటీలుగా పనిచేసేందుకు రేసులో ఉన్న వారి చేత తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. ఉపాధ్యక్ష హోదా కోసం పోటీపడుతున్న డెమోక్రట్ సేనేటర్ టిమ్ కెయిన్, రిపబ్లికన్ అభ్యర్థి మైక్ పెన్స్ మధ్య వర్జీనియాలోని లాంగ్ వుడ్ యూనివర్సిటీలో రసవత్తర చర్చ జరిగింది. ఈ చర్చలో అబార్షన్ నుంచి రష్యా లాంటి అంశాలపై తమ అభిప్రాయాలను వినిపించారు. కానీ ఇద్దరూ ట్రంప్, క్లింటన్‌లపైనే తమ వాగ్బాణాలను సంధించారు. ఈ సందర్భంగా డెమోక్రట్ కెయిన్ మాట్లాడుతూ... అమెరికా అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ను ఓ ఫూల్, పిచ్చోడు అని అభివర్ణించారు. రిపబ్లికన్ మైక్ పెన్స్ చెబుతూ.. హిల్లరీ క్లింటన్ బలహీనురాలు, అసమర్థురాలు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు. నెమ్మదస్తుడిగా పేరొందిన కెయిన్ ఈ చర్చలో దూకుడుగా వ్యవహరిస్తూ, మాజీ దేశాధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ అభిప్రాయాలను వెల్లడించారు. ఓ పిచ్చోడు మాత్రమే అణ్వాయుధాలను వినియోగిస్తాడంటూ ట్రంప్ ను ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు. ట్రంప్ టెంపర్ మెంట్ పైన కూడా ఆయన మండిపడ్డారు. మాజీ మిస్ యూనివర్స్ పై ట్రంప్ చేసిన విమర్శలు, పుతిన్ పై ఆయన చేసిన పొడగ్తలను ఆయన తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. ఇక రిపబ్లికన్ అభ్యర్థి పెన్స్ ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ను సమర్థించారు. ట్రంప్ సామర్థ్యాన్ని పుతిన్ గౌరవిస్తారని పెన్స్ అన్నారు. అసమర్థులైన హిల్లరీ, ఒబామా వల్లే రష్యా బలమైన దేశంగా ఎదిగిందని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. సిరియా ప్రభుత్వాన్ని అమెరికా దళాలు టార్గెట్ చేయాలని పెన్స్ అభిప్రాయపడ్డారు. దీంతో వీరిద్దరి మధ్య చర్చ అమెరికన్లను ఆకట్టుకుంది.