: రాముడిగా మోదీ.. పదితలల రావణుడిగా పాక్ ప్రధాని.. కేజ్రీవాల్ మేఘనాథుడు: వారణాసిలో పోస్టర్లు
పాకిస్థాన్, ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు దసరా పండుగ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌పై కుట్రలు పన్నుతూ పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రామాయణంలోని పదితలల రావణాసురుడిగా ప్రవర్తిస్తున్నాడంటూ యూపీలోని వారణాసిలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రాముడిగా కనిపిస్తున్నాడు. అంతేగాక, ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆ పోస్టర్లలో మేఘనాథుడు (రావణుడి కొడుకు)గా కనిపిస్తున్నాడు. శివసేన వారణాసి శాఖ పేరుతో వెలిసిన ఈ పోస్టర్లలో మోదీ రాముడిలా పదితలలతో ఉన్న నవాజ్ షరీఫ్‌పై బాణాలు సంధిస్తున్నట్లు చిత్రాలు ఉన్నాయి. భారత్ మరో సర్జికల్ స్ట్రయిక్స్ జరపాల్సిందేనని కూడా ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. రావణ రూపంలో పాక్ ఉందని ఆ దేశం అంతు చూడాలని పోసర్ల ద్వారా తమ ఆకాంక్షను తెలిపారు. వారణాసి నగరంలో ఇటువంటి పోస్టర్లు ఎన్నో కనపడుతున్నాయి.