: ఆర్మీకి పది లక్షలు ఇస్తున్నా...దీపావళి ఖర్చుతో ఆర్మీని ఆదుకుందాం: చినజీయర్ స్వామి పిలుపు
ఆర్మీకి అండగా నిలబడదామని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటోందని, సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించి, వారికి పునరావాసం కల్పిస్తోందని, అలాంటి సమయంలో దేశప్రజలంతా కేంద్రానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. దీపావళి, దసరా ఖర్చులు తగ్గించుకుని ఆర్మీకి కొంత ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఆర్మీ నిధికి పది లక్షల రూపాయలు తాను జతచేస్తానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా పాక్ తో సంబంధాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వాజ్ పేయి ప్రధానిగా ఉండగా, పాకిస్థాన్ తో సామరస్యపూర్వక సంబంధాల కోసం ప్రయత్నించి...లాహోర్ కు బస్సు వేస్తే, ఆ దేశం మనకు ఇచ్చిన బహుమతి కార్గిల్ వార్ అని ఆయన గుర్తు చేశారు. ఆ యుద్ధంలో మన ప్రాంతానికి చెందిన 8 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. వారి కుటుంబ సభ్యులను హైదరాబాదులోని దోమల్ గూడకు తీసుకొచ్చి, అమరసేవాతరంగిణి పేరుతో కొంత మొత్తం అందజేసి సత్కరించామని ఆయన చెప్పారు. సుదీర్ఘ కాలం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్ తో మంచి సంబంధాలు నెలకొల్పడం ద్వారా సౌహార్దతను చాటాలని భావించి, పాకిస్థాన్ వెళ్లి అక్కడి వారిని పలకరించి వచ్చారని అన్నారు. ఆ తరువాత పాక్ యూరీ సెక్టార్ దాడులను బహుమతిగా ఇచ్చిందని ఆయన తెలిపారు. పాక్ స్పందనకు దీటైన రీతిలో మన జవాన్లు సర్జికల్ స్ట్రైక్స్ తో సమాధానం చెప్పారని ఆయన తెలిపారు. దేశప్రజలు భద్రంగా ఉంటున్నారంటే జవాన్ల చలువేనని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంలో ప్రతి భారతీయ పౌరుడు స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. ఇది నాదేశం అని భావించే ప్రతి వ్యక్తి, ముక్తకంఠంతో సైన్యానికి మద్దతుగా నిలవాలని ఆయన కోరారు. ఇందుకు దేశ ప్రజలను సమాయత్తం చేసే బాధ్యతను ధర్మ ఆచార్యులుగా ఉండే వ్యక్తులు స్వీకరించాలని ఆయన సూచించారు. కేవలం హిందూ ధర్మాచార్యులు మాత్రమే కాకుండా ఇస్లాం, క్రైస్తవ, బౌద్ధ ఇతర ధర్మాచార్యులు కూడా దేశానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మన మిలటరీకి ధైర్యం కలిగించాలంటే ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన సూచించారు. దీపావళికి సరదాగా కాల్చే ఔట్లు, బాంబులను కొంచెం త్యాగం చేస్తే... దేశం కోసం త్యాగాలు చేసేవారికి మరింత ధైర్యం కలిగించేవారమవుతామని ఆయన తెలిపారు.