: ప్యాంట్లు ధరించే కవాతు చేయాలి.. నిక్కర్లు వేసుకొని చేయకూడదు: ఆర్ఎస్ఎస్ కి మద్రాసు హైకోర్టు ఆదేశాలు
దసరా ఉత్సవాల్లో భాగంగా తమిళనాడులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించనున్న వేడుకల్లో ఆ సంఘ్ కార్యకర్తలు నిక్కర్లు వేసుకొని కవాతు చేయకూడదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఆర్ఎస్ఎస్ ఇటీవలే నిక్కర్ల స్థానంలో ప్యాంట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కార్యకర్తలు ప్యాంట్లనే ధరించి కవాతులో పాల్గొనాలని న్యాయస్థానం సూచించింది. తమిళనాడులో ఆర్ఎస్ఎస్ డ్రెస్ కోడ్ పై వివాదం ఉంది. చెన్నై పట్టణ పోలీసు చట్టం ప్రకారం సాయుధ బలగాలు ధరించే యూనిఫాంలను ఇతరులు ధరించకూడదు. కానీ, సంఘ్ డ్రెస్ కోడ్ అదే విధంగా ఉంటుంది. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్ స్పందిస్తూ.. తమను అణగదొక్కేందుకే ఆ రాష్ట్ర అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాగా, సంఘ్ ఇటీవలే ప్రారంభించిన కొత్త డ్రెస్ కోడ్ ను ఈ దసరానుంచే అమలులోకి తీసుకురానుంది.