: అమెరికన్లను బెదిరిస్తూ రోజుకు కోటి రూపాయలు నొక్కేస్తున్న ముంబై కాల్ సెంటర్ ఉద్యోగులు... ఏకంగా 500 మంది అరెస్ట్


ముంబైలోని కాల్ సెంటర్లలో పనిచేస్తూ, అమెరికన్లను బెదిరిస్తున్నారన్న కేసులో 500 మంది ఉద్యోగులను క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం కలిగించింది. ఇక్కడి మీరా రోడ్ ప్రాంతంలోని కాల్ సెంటర్లపై 200 మంది పోలీసులు గత రాత్రి నుంచి తెల్లవారుఝాము వరకూ దాడులు చేసి వీరిని అరెస్ట్ చేశారు. తమను తాము అమెరికా ఆదాయపు పన్ను శాఖ అధికారులుగా చెప్పుకుంటూ, వీరు అమెరికన్లకు ఫోన్లు చేసి, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆర్థిక లావాదేవీలు చెప్పాలని బెదిరిస్తున్నారని, తాము చెప్పిన ఖాతాల్లో డబ్బు వేయాలని డిమాండ్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పలువురు అమెరికన్లు తాము బెదిరింపులకు గురవుతున్నామని ఫిర్యాదు చేయగా, అమెరికా పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఈ దాడులు చేశారు. ఈ కాల్ సెంటర్ల ఉద్యోగుల వలలో పడే అమెరికా పన్ను ఎగవేతదారులు, బడాబాబుల నుంచి రోజుకు కోటి రూపాయల వరకూ ఉద్యోగుల ఖాతాల్లోకి వస్తోందని పోలీసు వర్గాలు తెలిపాయి. వీరి కార్యకలాపాలపై కొంతకాలంగా కన్నేసిన ముంబై పోలీసులు గత రాత్రి మెరుపుదాడులు చేశారు. ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సి వుందని, కుంభకోణం చాలా పెద్దదని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News