: మెదక్ జిల్లాలో గ్రామపెద్దల ఆటవిక తీర్పు... హంతకుడికి వత్తాసు.. బాధిత కుటుంబం కుల బహిష్కరణ!
మెదక్ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామపెద్దలు ఆటవిక తీర్పును అమలు చేస్తున్నారు. ఒక్కగానొక్క కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి, ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసిన మృగాడికి సహకరిస్తూ... బాధితుడి కుటుంబాన్ని వెలివేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే....జంగరాయికి చెందిన చెరుకు దుర్గారెడ్డి కుమార్తె మౌనిక (22) గత ఏడాది మే 10న ఇంటికి వచ్చింది. మూడు రోజులపాటు ఇంట్లోనే ఉన్న మౌనిక 13న కనిపించలేదు. దీంతో కుమార్తె కోసం ఆ కుటుంబం తీవ్రంగా గాలించగా, అదేనెల 16న మెదక్ మండలం రాయిన్ పల్లి అటవీప్రాంతంలో ఓ డ్రమ్ములో శవమై కన్పించింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అదే గ్రామానికి చెందిన ఎం.రాంరెడ్డిని హంతకుడిగా గుర్తించారు. మౌనికపై అత్యాచారానికి పాల్పడ్డ రాంరెడ్డి, అనంతరం అత్యంత పాశవికంగా కత్తులతో పొడిచి చంపి, మృతదేహాన్ని నీళ్ల డ్రమ్ములో కుక్కి అటవీప్రాంతంలో పారేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇలా తప్పించుకుని తిరుగుతున్న రాంరెడ్డిని గుంటూరు జిల్లాలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇటీవల తాను ఊరికి దూరంగా ఉండడంతో అతని 4 ఎకరాల పొలం బీడుపడింది. ఎవరూ దానిని సాగుచేసేందుకు ముందుకు రాకపోవడంతో గ్రామపెద్దలను కలిసిన రాంరెడ్డి పెద్దలు చెప్పినట్టు వింటానని వారికి ఒక ఆఫర్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన గ్రామపెద్దలు మృతురాలు తండ్రి దుర్గారెడ్డితో రాజీకి రంగం సిద్ధం చేశారు. తప్పు చేసిన రాంరెడ్డి 1.5 లక్షల రూపాయలు ఇస్తే దుర్గారెడ్డి కేసు ఉపసంహరించుకోవాలని తీర్పునిచ్చారు. అయితే, దీనికి దుర్గారెడ్డి ఎదురు తిరిగాడు. తన కుమార్తే లేనప్పుడు ఆ డబ్బును తానేం చేసుకుంటానని నిలదీశాడు. తన కుమార్తెను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వ్యక్తి శిక్షించబడాల్సిందేనని ఆయన స్పష్టం చేశాడు. దీంతో తమ మాట వినలేదన్న ఆగ్రహంతో గ్రామ పెద్దలు దుర్గారావు కుటుంబాన్ని కుల బహిష్కరణ చేశారు. గ్రామంలో ఎవరూ ఆ కుటుంబానికి సహకరించకూడదని, సహకరిస్తే వారికి కూడా ఇదే తీర్పు వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో దుర్గారావు కుటుంబం ఒంటరిదైపోయింది. మరోపక్క తన కుమారుడికి వివాహం చేయాలని ముహూర్తం నిర్ణయించగా, అందుకు కూడా గ్రామస్తులు సహకరించలేదు. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బోనమెత్తిన దుర్గారెడ్డి భార్య లక్ష్మిని తమలో కలుపుకునేందుకు మహిళలు నిరాకరించారు. దీంతో ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఊరి పెద్దలకు కౌన్సిలింగ్ చేశారు. ఇప్పటికైనా వారిలో మార్పు రాకపోతే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.